ప్రతిపక్షం, ఆగస్టు 31: సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, గాయకుడు కాలభైరవ, నటి కావ్య కళ్యాణ్‌రామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా వెల్లడించారు. తమ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోబోతున్నట్లు ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టులు చేశారు.
ఈ సందర్భంగా కాలభైరవ తన ఆనందాన్ని భావోద్వేగపూరితంగా పంచుకున్నారు. కావ్యతో కలిసి గడిపే ప్రతి క్షణం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఆమెతో సమయం గడపడం ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కూర్చొని సెలయేటి ప్రవాహాన్ని ఆస్వాదించినట్లుగా ఉంటుందని, ఆమెతో మాట్లాడటం చలికాలపు ఉదయాన ఇష్టమైన కాఫీ తాగినంత హాయిగా అనిపిస్తుందని పేర్కొన్నారు.
ఇక జీవితాంతం ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉండబోతున్న విషయాన్ని అందరితో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కాలభైరవ తెలిపారు. వీరి పెళ్లి ప్రకటనతో సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కావ్య కళ్యాణ్‌రామ్ బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించారు. అనంతరం కథానాయికగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కాలభైరవ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరి వివాహ ప్రకటనతో టాలీవుడ్లో కొత్త జంటగా వీరిపై ఆసక్తి నెలకొంది.





























