ప్రతిపక్షం, ఆగస్టు 31: తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గాల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న మార్గాల ఆధునికీకరణ పనులను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులను సోమవారం ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ను రైల్వే హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణకు కేంద్రం ఐదు వందేభారత్ రైళ్లను అందించిందని, గత పదేళ్లలో రాష్ట్రంలో సుమారు 100 కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వేస్టేషన్ల ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.
42 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
తెలంగాణలో ఏకకాలంలో 42 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2014కు ముందు రైల్వేస్టేషన్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చిందని పేర్కొన్నారు.
రైల్వేస్టేషన్లు విమానాశ్రయాల స్థాయిలో ఆధునికంగా ఉండాలన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని తెలిపారు. పరిశుభ్రమైన రైల్వేస్టేషన్ల కోసం ప్రయాణికులు కూడా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు
తెలంగాణ రైల్వే రంగానికి కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ కేవలం రూ.886 కోట్లుగా ఉండేదని, 2026–27 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకే రూ.5,454 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రైల్వే రంగం నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం ఆ లోటును పూడ్చేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైలు ప్రాజెక్టులను చేపడుతుండగా తెలంగాణకు మూడు ప్రాజెక్టులు దక్కాయని కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వే రంగంలో ఇది కీలకమైన మార్పుకు నాంది అని పేర్కొన్నారు. సుమారు రూ.5 లక్షల కోట్ల వ్యయంతో బుల్లెట్ రైలు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ప్రమాదాల నివారణకు కవచ్
రైల్వే ప్రమాదాలను నివారించేందుకు అత్యాధునిక భద్రతా వ్యవస్థ అయిన కవచ్ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. రైళ్ల సురక్షిత ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.





























