[t4b-ticker]

చండూరులో బీఆర్ఎస్ సమరభేరి – కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కూసుకుంట్ల

యూరియా లేదు, నీళ్లు లేవు – రైతులకు కాంగ్రెస్ శాపంగా మారింది.ఖాకీ తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకోండి – పోలీసులపై కూసుకుంట్ల ఫైర్

40 కోట్లు, 100 పడకల ఆసుపత్రి ఇస్తే పూర్తి చేయలేకపోయారు .

కాంగ్రెస్ కార్యకర్త శివ అరెస్టుపై ఆగ్రహం – వెంటనే విడుదల చేయాలి .

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్

ప్రతి పక్షం చండూరు, సెప్టెంబర్ 04: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేసిందని నిరసిస్తూ చండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం భారీ ‘సమరభేరి’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సభలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సభలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు యూరియా సకాలంలో అందక, వర్షాలు లేక పత్తి చేలు ఎండిపోతుంటే అన్నదాతల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో పోరాడి ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులు నింపేలా కృషి చేశామన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రాజెక్టులకు నీళ్లు తీసుకురావాలనే చిత్తశుద్ధి ఏమాత్రం లేదని మండిపడ్డారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా, స్థానిక ఎమ్మెల్యే కేవలం మంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలేవీ నేటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీకి రూ. 40 కోట్లు, 100 పడకల ఆసుపత్రి, మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తే.. ఇప్పటివరకు వాటిని పూర్తి చేయించడంలో ప్రస్తుత ఎమ్మెల్యే విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.
హామీల అమలుపై ప్రశ్నించిన కాంగ్రెస్ కార్యకర్త శివను అక్రమంగా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడాన్ని కూసుకుంట్ల తీవ్రంగా ఖండించారు. ప్రజల తరఫున నిలదీసే గొంతులను నొక్కేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని, వెంటనే శివను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం మానుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు. రాజకీయం చేయాలనుకుంటే ఖాకీ చొక్కాలు తీసేసి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడే ప్రజా సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో చండూరు మండల పట్టణ అధ్యక్షులు బొమ్మన బోయిన వెంకన్న, కొత్తపాటి సతీష్, కల్లుగీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వాయి స్రవంతి, మునగాల నారాయణరావు, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, పల్లె కళ్యాణి, మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, అన్నేపర్తి సంతోషా శేఖర్, మాజీ మున్సిపల్ చైర్మెన్ తోకల చంద్రకళ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మాధవి వెంకటరెడ్డి, దంటు జగదీష్, మండల ఆధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, యువజన అధ్యక్షుడు ఉజ్జని అనిల్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దగోని వెంకన్న గౌడ్, అన్నేపర్తి శేఖర్, కౌన్సిలర్లు తేలుకుంట రాజకుమారి చంద్రశేఖర్, సామ సుజాత యాదవ రెడ్డి, కొండ్రెడ్డి మధు, పెండ్యాల గీత, సంఘపు సువర్ణ, చొప్పరి దశరథ, మహమ్మద్ గౌస్, ఇడికూడ నాగరాజు, నందికొండ నరసింహారెడ్డి, ఇరిగి రామన్న, చిలువేరు నరేష్, నారపాక శంకర్, అన్నిపాక ధనయ్య, స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ నాయకులు, మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News