[t4b-ticker]

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి.. నిర్మాణాల పురోగతిపై క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతిపక్షం, సెప్టెంబర్ 04: వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పరిశీలించారు. జిల్లాల పర్యటనలో భాగంగా హకీంపేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి.. ఎడ్యుకేషన్‌ హబ్‌లో నిర్మిస్తున్న వివిధ విద్యా, వైద్య సంస్థల భవన సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒక్కో నిర్మాణాన్ని స్వయంగా పరిశీలిస్తూ పనుల పురోగతి, నాణ్యత, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌లో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల, వెటర్నరీ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, ఫిజియోథెరపీ, పారామెడికల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలతో పాటు 400 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. వీటితో పాటు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనాలు, విద్యార్థుల కోసం హాస్టల్‌ సముదాయాల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ అన్ని నిర్మాణాలను సీఎం రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎడ్యుకేషన్‌ హబ్‌లో చేపడుతున్న అన్ని నిర్మాణ పనుల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు ఒకదానికొకటి ఆటంకం కలగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

భవన నిర్మాణాల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ సామగ్రి నాణ్యత, సాంకేతిక ప్రమాణాలు, పనుల అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులను రూపొందించాలని, విద్యార్థులు, సిబ్బంది, రోగులకు అనువుగా అన్ని సదుపాయాలు ఉండేలా నిర్మాణ ప్రణాళికలను అమలు చేయాలని చెప్పారు.

వర్షాకాలంలో ఎడ్యుకేషన్‌ హబ్‌ ప్రాంగణంలో నీరు నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం వాటర్‌ హార్వెస్టింగ్‌ వెల్స్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షపు నీటిని వృథాగా బయటకు వెళ్లకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

వర్షపు నీటిని సేకరించి ఎడ్యుకేషన్‌ హబ్‌లోని ల్యాండ్‌స్కేపింగ్‌ పనులకు వినియోగించే విధంగా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం తెలిపారు. పర్యావరణహిత విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. నిర్మాణాలతో పాటు పచ్చదనం, నీటి నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి అంశాలను కూడా ప్రణాళికలో భాగంగా పరిగణించాలని చెప్పారు.

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ భవిష్యత్‌లో విద్య, వైద్యం, సాంకేతిక విద్యకు కీలక కేంద్రంగా మారేలా నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఒకే ప్రాంతంలో వివిధ విద్యా సంస్థలు, ఆసుపత్రి, వసతి సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థులు, ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల పరిధిలో చేపడుతున్న పనుల పురోగతి, వాటి అమలు పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రజలకు త్వరగా వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

Spread the love

Related News

Latest News