ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 05: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌లో నిర్వహించనున్న సభకు వెళ్తున్న కేటీఆర్‌కు అల్గునూర్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
స్వాగత కార్యక్రమం అనంతరం కేటీఆర్ కారులో బయలుదేరిన కొద్దిసేపటికే పక్కనుంచి వెళ్తున్న ఓ లారీ ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. లారీ కారు డోరును ఢీకొనడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అయితే అదృష్టవశాత్తూ కేటీఆర్ కారులోనే ఉన్నప్పటికీ ఈ ప్రమాదంలో ఆయనకు గానీ, కారులో ఉన్న ఇతరులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పార్టీ శ్రేణులు, అక్కడున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప ప్రమాదం మాత్రమే కావడంతో కేటీఆర్ తన ప్రయాణాన్ని కొనసాగించారు.





























