ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: అధిక రక్తపోటు సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడంతో పాటు, దాన్ని సరైన పద్ధతిలో కొలవడం కూడా ఎంతో ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. బీపీ కొలిచే సమయంలో చిన్నపాటి పొరపాట్లు జరిగినా రీడింగ్‌లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది.
రక్తపోటును పరీక్షించుకునే ముందు కనీసం ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. బీపీ కొలిచేటప్పుడు కుర్చీలో నిటారుగా కూర్చొని వీపును కుర్చీకి ఆనించి ఉంచాలి. రెండు కాళ్లను క్రాస్ చేయకుండా పాదాలను పూర్తిగా నేలపై ఉంచాలి.
బీపీ కొలిచే సమయంలో ఉపయోగించే కఫ్ పరిమాణం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చేతి పరిమాణానికి సరిపోయే సరైన సైజు కఫ్‌ను మాత్రమే ఉపయోగించాలి. కఫ్ అమర్చిన చేతిని గుండె స్థాయిలో ఉండేలా సౌకర్యవంతంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటు రీడింగ్ మరింత ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే బీపీ పరీక్షకు కనీసం అరగంట ముందు టీ, కాఫీ వంటి కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు. ధూమపానం చేయడం, శారీరక వ్యాయామం చేయడం కూడా ఆ సమయంలో నివారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వీటి వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉండటంతో పరీక్ష ఫలితాల్లో మార్పులు రావచ్చు.
ముఖ్యంగా బీపీ కొలుస్తున్న సమయంలో మాట్లాడకూడదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. ప్రశాంతంగా కూర్చొని, శరీరాన్ని సడలించిన స్థితిలో ఉంచి పరీక్ష చేయించుకోవాలి. ఒకే ఒక్క రీడింగ్ ఆధారంగా నిర్ణయానికి రాకుండా, వైద్యుల సూచన మేరకు అవసరమైతే పలుమార్లు బీపీని పరీక్షించుకోవడం మంచిది.
రక్తపోటును సరైన విధానంలో కొలవడం ద్వారా వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి వీలవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సూచనలను పాటించడం ద్వారా సమస్యను నియంత్రణలో ఉంచుకోవచ్చు.





























