[t4b-ticker]

‘కేసీఆర్ అసెంబ్లీకి రావొచ్చు కదా’.. కేటీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోలేరు’ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ.. అదే నిజమైతే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చుకదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పనైపోతుందని కేటీఆర్ భావిస్తున్నట్లయితే.. ఆయనను సభకు తీసుకురావడానికి బీఆర్ఎస్ ఎందుకు వెనుకాడుతోందని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ‘కేటీఆర్ చెప్పినట్లుగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్, కాంగ్రెస్ పనైపోతుంది. అంతకంటే బీఆర్ఎస్‌కు కావాల్సింది ఇంకేం ఉంది?’ అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అసెంబ్లీ వేదికగా తమ సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. సభకు హాజరు కాకుండా బయట నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని విమర్శించారు.

ఇదే అంశంపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు మరో అడుగు ముందుకేశారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహించారు. కేసీఆర్ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని, ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను నిర్వర్తించాలని వారు కోరారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదనే అంశాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయంగా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ సభకు వస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తారని, ఆయనను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదనే వాదనను తెరపైకి తెస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల వేళ ఇరు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు మరింత ముదురుతున్నాయి.

Spread the love

Related News

Latest News