ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 06: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై కరీంనగర్ లో బి.అర్.ఎస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కరీంనగర్ లో భారీ ఎత్తున ఆటోల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండా ఊపి ఆటో ర్యాలీనీ ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఆటో నడిపారు. ర్యాలీ ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కండువా మరియు ఓటుకు నోటుకు దొంగ అనే అంశంతో వినూత్న రీతిలో ముద్రించిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న ఒక జెండా, నేడు ఇంకో కండువా…నేను అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ… ఎటు లాభం ఉంటే అటు జంప్ అన్న అర్థం వచ్చేలా వినూత్న రీతిలో తయారు చేసిన ఫ్లెక్సీ చూపరులను ఆలోచింపజేసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికుల సమస్యలపై తమ గళం వినిపిస్తామని ఈ సందర్భంగా గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.






























