ప్రతిపక్షం, సెప్టెంబర్ 09: తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించి ట్రాన్స్జెండర్లకు హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. పోలీస్ ఉద్యోగాల కోసం వారు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలిని (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదేశించింది. పురుషులు, మహిళలతో పాటు ఇతర లింగాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఎందుకు కల్పించడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది.
పోలీస్ నియామక ప్రక్రియలో తమకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించలేదంటూ తనుశ్రీతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఆన్లైన్ దరఖాస్తు విధానంలో ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయంగా ఆఫ్లైన్లో దరఖాస్తులను స్వీకరించాలని టీఎస్ఎల్పీఆర్బీకి సూచించింది.
పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో మేల్, ఫిమేల్ ఆప్షన్లు మాత్రమే ఉండటంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇతర లింగాలకు చెందిన అభ్యర్థులకు కూడా ఉద్యోగ నియామక ప్రక్రియలో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి టీఎస్ఎల్పీఆర్బీ వైఖరిని హైకోర్టు ప్రశ్నించింది. ట్రాన్స్జెండర్ అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఆన్లైన్ వ్యవస్థలో సాంకేతికంగా అవకాశం కల్పించడం సాధ్యం కాకపోతే.. ఆఫ్లైన్ ద్వారా వారి దరఖాస్తులను స్వీకరించాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ఎల్పీఆర్బీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికి నియామక ప్రక్రియలో ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు దరఖాస్తు అవకాశం కల్పించేందుకు తీసుకున్న చర్యలను అధికారులు కోర్టుకు వివరించాల్సి ఉంటుంది.
హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు కొత్త అవకాశం ఏర్పడింది. నియామక ప్రక్రియలో తమకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని వారు చాలాకాలంగా కోరుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తదుపరి విచారణలో ప్రభుత్వం, నియామక మండలి సమర్పించే కౌంటర్పై ఉత్కంఠ నెలకొంది.





























