*ఆటో, ట్రాక్టర్ ఉందని పేదలను అనర్హులుగా ప్రకటించడం సరికాదు.
*నిర్మాణ వ్యయం పెరిగింది – ఇందిరమ్మ ఇంటికి మినిమం 10 లక్షలు అవుతోంది.
*నిబంధనలు సడలించి నిధులు పెంచండి, ఇంటి స్థలం లేనోళ్లను గుర్తించండి ప్రభుత్వానికి విజ్ఞప్తి.
*కొత్త జీవోతో మొదటి విడత లబ్ధిదారులకు బిల్లులు రావట్లేదు – సడలింపు ఇవ్వండి
*అసెంబ్లీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ప్రతిపక్షం మునుగోడు సెప్టెంబర్ 10: అసెంబ్లీలో ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు.ఈ ప్రభుత్వం పేదవాళ్ల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తున్నానని తెలిపారు.గ్రామాలలో ఆటోలు నడుపుకునే వారు, పాత ఇనుప సామాను అమ్ముకునేవారు, ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు అర్హులై ఉండి కూడా చిన్న చిన్న కారణాల వల్ల ఎంపిక కాలేకపోయారని అన్నారు. బ్రతుకుతెరువు కోసం తెచ్చుకున్న వాహనాలు ఉన్నాయని వారిని అనర్హులుగా ప్రకటించారని, అటువంటి నిరుపేదల విషయంలో ప్రభుత్వం, అధికారులు ఆలోచించి నిబంధనలను సడలించాలని కోరారు.
ఎంతమందికి ఇళ్లు కట్టిస్తున్నాం అనేది ప్రాధాన్యం కాదు, నిజమైన అర్హులకు ఎంతమందికి ఇళ్లు ఇచ్చామన్నది ముఖ్యమని, ఇచ్చే ప్రతి ఇల్లు అర్హులైన పేద వారికే దక్కాలనేదే తన ఉద్దేశం అని అన్నారు.ప్రస్తుతం నిర్మాణ వ్యయం బాగా పెరిగిందని, తక్కువలో తక్కువ మూడు లక్షల పైనే అవుతుందని, ఇందిరమ్మ ఇల్లు పూర్తి అవ్వడానికి మినిమం 10 లక్షలు అవుతుందని తెలిపారు. ఇళ్లు మంజూరైన కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు మొదలుపెట్టుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని, పేదలకు తమ జీవితంలో గర్వంగా చెప్పుకునే కార్యక్రమమని అన్నారు. అర్హులైన పేదవారికి ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇంటి నిధులు పెంచితే బాగుంటుందని సూచించారు.
క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు తమ దృష్టికి వచ్చిన పలు సమస్యలను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నానని, ఇంటి స్థలం కూడా లేని నిరుపేదలు చాలామంది ఉన్నారని, వాళ్లందర్నీ గుర్తించి వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే బాగుంటుందని కోరారు.ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇటీవల తీసుకొచ్చిన జీవో నిబంధనల ప్రకారం మొదటి విడతలో ఇల్లు మంజూరైన వాళ్లకు బిల్లులు రావడం లేదని, మొదటి విడతలో ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఈ జీవో నుండి సడలింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
































