24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
రాజగోపాలపేట, కొండం రాజు పల్లి సబ్‌స్టేషన్ల వద్ద రైతుల ధర్నా
నంగునూరు-గట్ల మల్యాల-ఖాతా రహదారిపై రాస్తారోకో
ప్రతిపక్షం, నంగునూరు, సెప్టెంబర్ 12: విద్యుత్ కోతలపై అన్నదాతలు ఆగ్రహించారు. విద్యుత్ కోతలతో పంటలకు సాగునీటిని అందించడం ఇబ్బందిగా మారడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. సబ్ స్టేషన్లను ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారులను దిగ్బంధిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కొండం రాజుపల్లి, రాజగోపాలపేట విద్యుత్ సబ్ స్టేషన్లను శనివారం రైతులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గట్లమల్యాల, ఘనపూర్, ఖాతా, కొండంరాజుపల్లి, సంతోష్ నగర్ గ్రామాలకు చెందిన రైతులు కొండంరాజుపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నినదించారు. ప్రస్తుతం విద్యుత్ కోతలు, సరఫరాలో అంతరాయాలతో సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు తెలిపారు. పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ అందక పోవడంతో బోర్లు, మోటార్లపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ కోతల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నాలుగు కొండం రాజు పల్లి, ఖాత, గణపురం, గట్ల మల్యాల సర్పంచులు సర్పంచులు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. విద్యుత్ లైన్ మెన్ పోతిరెడ్డి రాములు వినతి పత్రం అందించారు.
రాజగోపాలపేటలోనూ నిరసన
కరెంటు కోతలతో పంటలు ఎండి పోతున్నాయని ఆరోపిస్తూ రాజగోపాలపేట గ్రామ రైతులు ఆ గ్రామాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల ఇబ్బందులను విద్యుత్ శాఖ ఏఈ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తొలగించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన మేరకు నిరంతరాయ విద్యుత్ అందించాలని కోరారు. రైతుల పొలాలకు నీరు అందాలంటే విద్యుత్ సరఫరా కీలకమని పేర్కొన్నారు. కరెంటు కోతలు కొనసాగితే సాగు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
































