[t4b-ticker]

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

మండపాల నిర్వాహకులతో పోలీసుల సమన్వయ సమావేశం

మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

డీజేలకు అనుమతి లేదు.. రాత్రి 10 గంటల వరకే స్పీకర్లు

సోషల్‌ మీడియాలో వదంతులను నమ్మొద్దు: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు,

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 12: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్‌ టౌన్‌, మెదక్‌ రూరల్‌ సర్కిల్‌ పరిధిలోని ఐదు పోలీస్‌స్టేషన్లకు చెందిన గణేష్‌ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల ఏర్పాటు, భక్తుల భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, శబ్ద కాలుష్యం, నిమజ్జనం తదితర అంశాలపై పోలీసు అధికారులు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.సమావేశంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మాట్లాడుతూ.. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.

మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రతి గణేష్‌ మండపాన్ని పోలీసు శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని అనుమతి పొందాలని తెలిపారు. విగ్రహం ఎత్తు, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. మండపాల వద్ద 24 గంటలూ కనీసం ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. మండపాల వద్ద టపాకాయలు కాల్చరాదని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని, మండపాల వద్ద డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఎస్పీ కోరారు. ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా అవసరమైన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర పెట్రోలింగ్‌ నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు, గణేష్‌ మండపాల నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, సందీప్‌రెడ్డి, సీనియర్‌ సిటిజన్స్‌ సభ్యులు, గణేష్‌ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News