ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 15: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన సుమారు 120 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యువ ఆపద మిత్ర పథకానికి ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్ 16 నుండి 22వ తేదీ వరకు ఒక వారం పాటు మంచిర్యాల జిల్లాలోని 13వ బెటాలియన్, గుడిపేట్ వద్ద విపత్తు నిర్వహణపై శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు.ఈ శిక్షణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తుల సమయంలో సహాయక చర్యలు, రక్షణ చర్యలు, విపత్తులపై ముందస్తు అవగాహన మరియు అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేలా యువతను సిద్ధం చేయడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వాలంటీర్‌కు సుమారు ₹10,000 విలువైన విపత్తు సహాయక సామగ్రి కిట్‌ను అందించడంతో పాటు, బీమా సదుపాయం కూడా కల్పించనున్నారు.
ఈ సందర్భంగా శాతవాహన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం నుంచి 120 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రెండు బస్సుల్లో మంచిర్యాలకు బయలుదేరారు. ఈ బస్సులను శాతవాహన విశ్వవిద్యాలయం ఓఎస్డి డా. డి. హరికాంత్ జిల్లా యువజన అధికారి జి. తిరుపతి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. పద్మావతి,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. డి. విజయ్‌కుమార్, డా. కె. తిరుపతి, డా. కె. అర్జున్, శ్రీమతి ఎలిజబెత్ రాణి, డా. వెంకటేశ్వర్లు, డా. సంగీతారాణి, డా. అరవింద్ తదితరులతో పాటు 120 మంది NSS వాలంటీర్లు పాల్గొన్నారు. వాలంటీర్లు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని విపత్తు నిర్వహణలో నైపుణ్యాలను పెంపొందించుకుని, భవిష్యత్తులో విపత్తుల సమయంలో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని విశ్వవిద్యాలయ అధికారులు ఆకాంక్షించారు.





























