[t4b-ticker]

నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచం గర్వించే తెలంగాణ నిర్మిద్దాం: రేవంత్‌ రెడ్డి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సమానంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌రెడ్డి.. ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు ఘన నివాళులు అర్పించారు. తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని అన్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన యోధులకు ఈ ప్రాంతం పుట్టినిల్లు అని పేర్కొన్నారు.

1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైందని ముఖ్యమంత్రి తెలిపారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భంగా ఈ తేదీని ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని వివరించారు. ప్రజాపాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం, హక్కులను కాపాడడం, ప్రభుత్వ వనరులు అందరికీ సమానంగా చేరేలా చూడటమని అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, ఇందుకోసం రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లించామని తెలిపారు.

ప్రభుత్వ మద్దతుతో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సంస్కరణలు చేపట్టామని, భూధార్‌, కృత్రిమ మేధ ఆధారిత భూమిత్ర సేవలను ప్రారంభించామని వివరించారు. 5.94 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు తెలిపారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయపోరాటం కొనసాగిస్తున్నామని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకం, ఎస్‌ఎల్‌బీసీతో పాటు ఇతర పెండింగ్‌ ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు

తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా, ఆర్థిక స్వాతంత్ర్యంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీని ద్వారా మహిళలకు రూ.12,385 కోట్ల మేర ప్రయాణ ఖర్చు ఆదా అయిందని పేర్కొన్నారు.

గృహజ్యోతి పథకం కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల సహాయం అందించామని వివరించారు.

4.54 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు రుణ అనుసంధానం, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించామని తెలిపారు. మహిళా మార్ట్‌లు, పెట్రోల్‌ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సుల ద్వారా మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.

పేదలు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశామని, 43 లక్షలకు పైగా మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల కింద సుమారు రూ.31 వేల కోట్లు అందించామని తెలిపారు. తాజాగా మరో 2.25 లక్షల మందికి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో నివసించాలన్నది ప్రభుత్వ ఆశయమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. హైదరాబాద్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వివరించారు.

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపై కుల సర్వే నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ సర్వే గణాంకాల ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టామని, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

విద్య, వైద్య రంగాలకు పెద్దపీట

విద్య, వైద్యం ప్రజా ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా సమగ్ర నివాస పాఠశాలలను నిర్మిస్తున్నామని, ఒక్కో పాఠశాలకు 20 నుంచి 25 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించామని, ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించేందుకు రూ.927 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని 12వ తరగతి వరకు విస్తరించామని, 11 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యా రంగంలో తీసుకున్న చర్యలతో పనితీరు సూచీలో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని చెప్పారు.

ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల విదేశీ ప్రాంగణాలను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అమెరికాకు చెందిన నార్త్‌ఈస్టర్న్‌ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ తమ విదేశీ ప్రాంగణాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయని చెప్పారు.

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5.19 లక్షల మందికి రూ.2,526 కోట్ల సహాయం అందించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. సనత్‌నగర్‌లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించామని, అల్వాల్‌, ఎల్‌బీనగర్‌ టిమ్స్‌ ఆసుపత్రులను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వరంగల్‌లో 2 వేల పడకలతో టిమ్స్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాలు

తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం యువత పోరాడిందని అన్నారు. ఇప్పటివరకు 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామని, గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌-4 వరకు పరీక్షలను నిర్వహించామని తెలిపారు.

కృత్రిమ మేధ కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో కొత్త నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లోనూ కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని వివరించారు.

మౌలిక వసతుల విస్తరణ

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఆదిలాబాద్‌, మామునూరు విమానాశ్రయాలకు అనుమతులు సాధించామని, అవసరమైన భూసేకరణ చేపట్టామని తెలిపారు.

హైదరాబాద్‌ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలనే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టామని అన్నారు. 55 కిలోమీటర్ల పరిధిలో మూసీని పునరుజ్జీవింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రహదారులు అభివృద్ధికి సూచికలని పేర్కొంటూ గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. రహదారులు, భవనాల శాఖ పరిధిలో రూ.13 వేల కోట్లు, పంచాయతీరాజ్‌ పరిధిలో రూ.6,294 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నామని చెప్పారు.

భవిష్యత్‌ తెలంగాణకు దీర్ఘకాలిక ప్రణాళికలు

ఈ రోజు అవసరాలు తీర్చడంతో పాటు రేపటి తెలంగాణను నిర్మించడమే తమ లక్ష్యమని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్‌ 2047 లక్ష్యాల సాధనకు ప్రణాళికలు రూపొందించామని, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దేశంలో తొలి నెట్‌-జీరో స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు సందర్భంగా ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీలో టీసీఎస్‌ రూ.70 వేల కోట్లతో భారీ కృత్రిమ మేధ సమాచార కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని, అమెజాన్‌ రూ.లక్ష కోట్ల పెట్టుబడితో సమాచార కేంద్ర నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు.

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, జీవశాస్త్ర పరిశోధనల కేంద్రం, విద్యుత్‌ వాహనాల పార్కు, కృత్రిమ మేధ నగరం, ఆరోగ్య నగరం, విద్యా నగరం వంటి ప్రత్యేక ప్రాంతాలతో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రాంతీయ రింగ్‌ రోడ్డు, హరిత రహదారులు, సరకు రవాణా కేంద్రాలు, హైదరాబాద్‌–నాగ్‌పూర్‌, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–విజయవాడ పారిశ్రామిక మార్గాలు తెలంగాణ భవిష్యత్‌ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.

కల్తీ ఆహారం, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు

ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఆహార కల్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆహార నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువత పెడదోవ పట్టకుండా తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు.

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ వంటి సవాళ్లు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణ పోరాట స్ఫూర్తిని ఆధారంగా చేసుకుని అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు చేరేలా, ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించేలా ప్రజల భాగస్వామ్యంతో ఆధునిక తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Spread the love

Related News

Latest News