[t4b-ticker]

పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి ప్రకటించాలి

జూలై 2023 నుంచి 41 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలి

ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

జి.తిరుపతిరెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు.

ప్రతిపక్షం, నంగునూరు, సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి. తిరుపతిరెడ్డి ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను వెంటనే తెప్పించుకుని ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ నంగునూరు మండల శాఖ అధ్యక్షులు పొనమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ముండ్రాయి, పాలమాకుల, రాజగోపాల్‌పేట, బద్దిపడగ, సిద్దన్నపేట, మగ్దుంపూర్, నంగునూరు, అంక్షాపూర్, నర్మెట తదితర పాఠశాలల్లో సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలి

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా నిర్ణయించిన జేఏసీ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.
ఈ నెల 9వ తేదీన పీఆర్సీ నివేదికను సమర్పించాలని కమిషన్‌ను ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం నివేదికను తెప్పించుకోకపోవడం బాధాకరమన్నారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని, జూలై 2023 నుంచి 41 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి

టీపీటీఎఫ్‌ అధికారిక మాస పత్రిక ఉపాధ్యాయ పత్రిక సంపాదకుడు ఎస్.కనకయ్య మాట్లాడుతూ సిద్ధిపేట జిల్లాలో పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా వేతనాలు అందకపోవడం ఆందోళనకరమన్నారు. దసరా పండుగలోగా పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను విడుదల చేసి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో విద్యా బోధనకు అనుకూలమైన మౌలిక వసతులను కల్పించాలని కోరారు.

పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి

ప్రాథమిక పాఠశాలలో ప్రతి పూర్వ ప్రాథమిక తరగతులకు అవసరమైన తరగతి గదులను ఏర్పాటు చేయాలని టీపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని కోరారు. చిన్నారులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలపైనా ప్రభుత్వ దృష్టి పెట్టాలని కోరారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు బదిలీల అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారికి క్రమబద్ధమైన వేతన శ్రేణులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కేజీబీవీలో వార్డెన్‌లను నియమించాలని కోరారు. రాత్రి విధులు నిర్వహించే ఉపాధ్యాయులు నిరంతరం అదనపు భారం మోపకుండా విధి నిర్వహణలో తగిన విశ్రాంతి సమయం కల్పించాలని కోరారు. రాత్రి విధులు పూర్తయిన తర్వాత 24 గంటలు దాటకుండా తిరిగి విధులకు హాజరు కావాల్సిన పరిస్థితిని నివారించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ

మండలంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉపాధ్యాయుల నుంచి స్పందన లభించింది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల సమస్యలను సేకరించి, వాటిని సంఘం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.సత్యనారాయణ, మండల శాఖ ప్రధాన కార్యదర్శి పి. నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు పి. సుశీల, రవీందర్‌రెడ్డి, తిరుపతి, రాజు, నగేశ్, కన్యాలాల్, రాజిరెడ్డి, రాంగోపాల్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్ పి.రాజు, అనిత, అంబిక, శశికళ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News