వంటావార్పుతో పాలిటెక్నిక్ ఉద్యోగుల వినూత్న నిరసన
రాజగోపాలపేటలో నల్లబ్యాడ్జీలతో 31వ రోజు భోజన విరామ నిరసన
ప్రతిపక్షం, నంగునూరు, సెప్టెంబర్ 18: ప్రభుత్వ పాలిటెక్నిక్ లను నైపుణ్య విశ్వ విద్యాలయంలో విలీనం చేసే ఉద్దేశంతో జారీ చేసిన జీవో నంబరు 97ను వెంటనే రద్దు చేయాలని పాలిటెక్నిక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉద్యోగులు శుక్రవారం కళాశాల ఆవరణలో వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు.ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయంలో విలీనం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. జీవో నంబరు 97 వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఉనికికి ముప్పు ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపైనా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయంలో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. జీవో నంబరు 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని వారు తెలిపారు. అయితే కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప జీవోను రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.
విద్యా వ్యవస్థను, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.రాబోయే రోజుల్లో దశలవారీగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వైఖరి సరికాదు
రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించారు. శుక్రవారం 31వ రోజు భోజన విరామ నిరసన నిర్వహించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేనను కలిసేందుకు వెళ్లిన ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులతో అనుచితంగా ప్రవర్తించారని ఉద్యోగులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి సంఘానికి కమిషనర్ కన్వీనర్‌గా ఉన్నారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలను వివరించేందుకు ఆమెను కలిసేందుకు వెళ్లామని పేర్కొన్నారు. తమ అభ్యంతరాలు, వివరణలను పూర్తిగా తెలుసుకోకుండానే తమతో అనుచితంగా మాట్లాడారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా కమిషనర్ తమను ఉద్దేశించి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. కమిషనర్ తన వైఖరిని మార్చుకోవాలని కోరారు. ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిరసనలు కొనసాగిస్తాం
జీవో నంబరు 97 రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఉద్యోగులు తెలిపారు.పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయంలో విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. జీవో నంబరు 97ను రద్దు చేసే వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.






























