19 రోజుల్లో నిందితుడిని పట్టుకున్న మర్రిగూడ పోలీసులు.
సైబర్ నేరాన్ని ఛేదించిన నాంపల్లి సీఐ దూది రాజు.
ప్రతిపక్షం, మర్రిగూడ సెప్టెంబర్ 20: స్థాయికి మించి అప్పులు, మార్గం దొరకక మోసాలకు పాల్పడిన వ్యక్తిని మర్రిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు నాణేలు తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తిని నమ్మించి రూ.6.20 లక్షలు కాజేసిన సైబర్ మోసం కేసును కేసు నమోదైన 19 రోజుల్లోనే ఛేదించడం పోలీసుల దర్యాప్తు వేగానికి నిదర్శనంగా నిలిచింది.నాంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దూది రాజు కేసును చాలెంజ్ గా తీసుకుని ఛేదించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన మాచర్ల వెంకటేష్ స్థానికంగా పాస్టర్ గా నెలకు రూ.1,20,000 జీతానికి పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమ్ లకు అలవాటు పడి సుమారు రూ.15 లక్షల వరకు నష్టపోయాడు. అప్పులను తీర్చే మార్గం దొరకక మోసాలకు తెరలేపాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చి బి.ఎన్.రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నాడు.
మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కుమారుడు జంగిలి వెంకటేష్ ను బంగారు నాణేలు ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం వివిధ కారణాలు చెబుతూ విడతల వారీగా రూ.6.20 లక్షలు తన ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నాడు. డబ్బులు తీసుకున్న తర్వాత నిందితుడు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మర్రిగూడ పోలీసులను ఆశ్రయించాడు.ఫిర్యాదు అందుకున్న నాంపల్లి సీఐ దూది రాజు కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ లావాదేవీలను పరిశీలిస్తూ నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు చివరకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి నిందితుడిని దేవరకొండ కోర్టులో రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు.
పోలీసుల సూచన:
ఆన్‌లైన్ లో పరిచయం లేని వ్యక్తులు చెప్పే మాటలను నమ్మి నగదు బదిలీ చేయవద్దని, బంగారం, పెట్టుబడులు, బహుమతుల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే పూర్తి వివరాలు నిర్ధారించుకోవాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్స్ అనిల్, ప్రశాంత్, కిరణ్ లను సీఐ అభినందించారు.





























