డిగ్రీ కళాశాలపై చర్యలకు డిమాండ్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ లో గల ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఐదు లక్షల జరిమానా విధించాలని ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి దిగంబర్ డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం ఇష్టరాజ్యంగా వ్యవహరించడంతో నష్టపోయిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో కాకతీయ యూనివర్సిటీ సెమిస్టర్ ఎగ్జామ్ నడుస్తున్నాయని, అయితే సదరు ప్రైవేటు డిగ్రీ కళాశాల యజమాన్యం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మాస్ కాపీయింగ్ నిర్వహిస్తున్నదని ఆరోపించారు. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే ఎగ్జామ్ రాయనివ్వకుండా తిరిగి పంపిస్తున్నారని తెలిపారు.విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సదరు డిగ్రీ కళాశాల పైనా క్రిమినల్ కేసు నమోదు చేసి ఐదు లక్షల జరిమానా విధించాలని డిమాండ్ చేశారు.
బడుగు బలహీన, పేద మైనార్టీ విద్యార్థులు అష్ట కష్టాలు పడి పరీక్షల కోసము తగ్గిన పేజీలు చెల్లించి పరీక్షల కోసం సిద్ధమవుతుంటే కళాశాలలో మాత్రం ఈ తరహ వ్యవహారాలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు.సదరు డిగ్రీ కళాశాలకు వేలల్లో డబ్బులు ఎలా ఇవ్వాలి అంటూ చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం లేదని తెలిపారు, సదరు ప్రైవేటు డిగ్రీ కళాశాల దందా వలన విద్యార్థులు భయ బ్రాంతులకు గురి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ, జిల్లా కలెక్టర్ లు స్పందించి సమగ్ర విచారణ జరిపి కళాశాలపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. లేకుంటే ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.