ప్రతిపక్షం, వెబ్డెస్క్: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోరజ్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రికార్డులను స్వాధీనపరుచుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారులు జైనథ్ మండలం బోరజ్ జాతీయ రహదారి నెంబర్ 44 వద్ద గల అంతరాష్ట్ర వాహనాల తనిఖీ కేంద్రంలో ఏసీబీ సోదాలు నిర్వహించి ఆర్టీవో సిబ్బంది అవినీతి కార్యకలాపాలపై విచారణ చేపట్టారు. రాష్ట్రంలోనే అతిపెద్ద చెక్ పోస్టుగా పేరున్న బోరజ్ తనిఖీ కేంద్రంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యశ్వంత్, ఏఎం విఐ అపర్ణ, విధులు నిర్వహిస్తుండగా అక్కడే కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు.
ప్రతిరోజు వేలాది వాహనాలు బోరజ్ చెక్ పోస్ట్ మీదుగా రాకపోకలు సాగిస్తుండగా భారీ వాహనాలకు సంబంధించి లైసెన్సు పర్మిట్, సరుకు రవాణా వేబిల్స్, వాహన బిల్లులు డాక్యుమెంట్ లపై ఎంత మేరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయంపై ఆరా తీశారు. ప్రతిరోజు వాహనదారులు చెల్లించే నగదు డబ్బు, ఆఫీసులో నమోదు చేసే బిల్లుల వివరాలపై రికార్డులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులను నియమించడంపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలిసింది. రెండు గంటలపాటు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏసీబీ దాడులతో ఆర్టీవో కార్యాలయంలో అలజడి మొదలైంది.