బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరికపై ఫిర్యాదు
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీలోకి చేరిన వీరి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. ఈ నోటీసుల వ్యవహారంతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేయాలంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కె.పి. వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో వారిద్దరికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
గతేడాది నవంబర్ చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.కానీ తాను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబడడం లేదంటూ.. అందుకు కారణాలు వివరిస్తూ.. కేసీఆర్‌కు ఆమె లేఖ రాసింది. అనంతరం కడియం శ్రీహరితోపాటు ఆయన కుమార్తె కావ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. రేవంత్ రెడ్డి సమక్షంలో మూడు రంగుల కండువా కప్పుకున్నారు. ఇక వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మరోవైపు భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు సైతం ఆ పార్టీ రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లడంతో.. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన వేళ… అంటే 2014 ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో కేసీఆర్ అధికారాన్ని చేపట్టారు. ఆ క్రమంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో పలు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సైతం తన కారు పార్టీలోకి తీసుకోవడం గమనార్హం.