ప్రతిపక్షం, నేషనల్: ఆర్బీఐ ఆంక్షల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కొత్త సమస్య ఎదురైంది. గత నెలాఖరున పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఎక్స్‌లో స్పందించారు. ‘దేశీయంగా పేటీఎం క్యూఆర్ కోడ్‌తో పాటు సౌండ్ బాక్స్ పనిచేస్తూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ ఔట్లెట్లలో డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన స్కాన్ -అండ్-పే ఎప్పటి లాగే పనిచేస్తూనే ఉంటుంది. ఈరోజు, రేపు, ఎప్పటికీ పేటీఎం చేయండి.. ‘ అని విజయ్ ట్వీట్ చేశారు.
ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్, ఫాస్టాగ్ డిపాజిట్లు ఏవీ తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దీన్ని మార్చి 15 వరకు పొడిగించారు. ఈ క్రమంలోనే పేటీఎం అన్ని రకాల సేవలు నిలిపోతాయని సోషల్ మీడియాలో కొన్ని నకిలీ కథనాలు సర్క్యులేట్ అయ్యాయి. దీనికి సంబంధించి ఆర్బీఐ సైతం స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు సంస్థ అధినేత కూడా సందేహపడొద్దని, క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్‌లు పనిచేస్తాయని పేర్కొన్నారు.