ప్రతిపక్షం, జూలై 22: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నేడు ‘ఛలో లోక్‌భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున లోక్‌భవన్‌కు చేరుకోవాలని పార్టీ నాయకత్వం సూచించింది.
ఢిల్లీలో జరిగిన పరిణామాలను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణిచివేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, “మమ్మల్ని జైలులో పెట్టవచ్చు.. అణచివేయడానికి ప్రయత్నించవచ్చు.. కానీ న్యాయం, జవాబుదారీతనం కోరుతూ పోరాడుతున్న యువత ఆగ్రహాన్ని మాత్రం అణచివేయలేరు” అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది.

















