ఏఐతో రూ.64 కోట్ల సైబర్ మోసం.. ఇంటర్ డ్రాపౌట్ యువకుడి అరెస్ట్

ప్రతిపక్షం, జూలై 22: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను దుర్వినియోగం చేసి కోట్ల రూపాయల సైబర్ మోసాలకు పాల్పడిన ఇంటర్ డ్రాపౌట్ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 18 ఏళ్ల షాక్య అనే యువకుడు నకిలీ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల పేరుతో మొబైల్ అప్లికేషన్లు రూపొందించి సైబర్ నేరగాళ్లకు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల వివరాల ప్రకారం, షాక్య ఏఐ టూల్స్, టెలిగ్రామ్ వేదికలను ఉపయోగించి మొత్తం 121 నకిలీ ఏపీకే (APK) అప్లికేషన్లు రూపొందించాడు. ఈ అప్లికేషన్ల ద్వారా ప్రజల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సేకరించి భారీ స్థాయిలో సైబర్ మోసాలు జరిగాయని గుర్తించారు.

ఈ నకిలీ యాప్‌లను ఉపయోగించి దేశంలోని పలు రాష్ట్రాల్లో బాధితుల నుంచి సుమారు రూ.64.38 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో షాక్య రూపొందించిన యాప్‌లను సైబర్ నేరగాళ్లకు విక్రయించి, వాటి ద్వారా మోసాలకు సహకరించినట్లు తేలిందన్నారు.

16 ఏళ్ల వయసులోనే కోడింగ్‌లో నైపుణ్యం సంపాదించిన షాక్య, తన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందేమోనన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అలాగే ప్రజలు తెలియని లింకులు, అపరిచిత యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Spread the love

Related News

Latest News