ప్రతిపక్షం, జూలై 22: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు.
ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా సుమారు ఐదు కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమైందని రాహుల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను దెబ్బతీసిందని, యువత భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.
నీట్ లీకేజీపై ప్రశ్నించిన విద్యార్థులు, నిరసనకారులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని ఆరోపించిన రాహుల్ గాంధీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.


















