ప్రతిపక్షం, జూలై 23: నీట్ పరీక్షల నిర్వహణపై మాజీ బీజేపీ నేత, ‘వీ ది లీడర్స్’ సంస్థ వ్యవస్థాపకుడు అన్నామలై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో మూడు సార్లు నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపిస్తూ, ఈ ఘటనలపై జవాబుదారీతనం కనిపించడం లేదని విమర్శించారు.
నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని తీసుకువస్తుందని, ముఖ్యంగా పేద విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు కల్పిస్తుందని తాను తొలుత విశ్వసించానని అన్నారు. అయితే వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీలు చోటుచేసుకోవడం వల్ల విద్యార్థుల్లో పరీక్షలపై విశ్వాసం దెబ్బతిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం విద్యార్థులు తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నామలై వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి వారి ఆందోళనలకు పరిష్కారం చూపాల్సిందిపోయి ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. విద్యార్థుల నమ్మకాన్ని పునరుద్ధరించేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


















