ప్రతిపక్షం, ఆగస్టు 07, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి వర్షాలు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రానున్న ఒకటి నుంచి రెండు గంటల్లో హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అదే సమయంలో ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉత్తర, మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇతర జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వర్షాల సమయంలో అవసరం లేకుంటే బయటకు వెళ్లకుండా ఉండాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలు, నీటితో నిండిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.





























