ప్రతిపక్షం, ఆగస్టు 07, హుస్నాబాద్: వన మహోత్సవం సందర్భంగా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, భవిష్యత్ తరాలు మనల్ని గుర్తుంచుకోవాలంటే ప్రకృతి సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్లే అధిక వర్షాలు, కరువు పరిస్థితులు, వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను నివారించాలంటే విస్తృతంగా మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ డిగ్రీ కళాశాల, మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని చెప్పారు. మొక్కలు నాటడం ఒకరోజు కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ జీవితంలో బాధ్యతగా భావించి వాటిని పెంచి సంరక్షించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు అందించే గొప్ప కానుక మొక్కలేనని, హుస్నాబాద్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఇంటా, ప్రతి సంస్థలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కండేయ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రస్తావించిన మంత్రి, చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రజలు ఎక్కువగా వినియోగించాలని కోరారు. ప్రభుత్వ జీవోల ప్రకారం చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా సింథటిక్ శాలువాల స్థానంలో నేతన్నలు నేసిన వస్త్రాలను వినియోగించాలని సూచించారు. చేనేత వస్త్రాలను ఉపయోగించడం ద్వారా నేత కార్మికులతో పాటు పత్తి రైతులకు కూడా ఆర్థికంగా మేలు జరుగుతుందని వివరించారు.
హుస్నాబాద్‌లో ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశామని మంత్రి గుర్తుచేశారు. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత వస్తువులను వినియోగిస్తూ, మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, తాము తొలిసారి హుస్నాబాద్ డిగ్రీ కళాశాలకు వచ్చినప్పుడు సరైన రహదారి కూడా లేకపోయిందని, ప్రస్తుతం అక్కడ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తైందన్నారు. త్వరలో కళాశాలకు కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ వంటి మౌలిక వసతులను కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థల యాజమాన్యాన్ని మంత్రి ఆదేశించారు.

































