ప్రతిపక్షం, ఆగస్టు 07: మహబూబాబాద్ జిల్లాలో భర్తను హత్య చేయాలని ప్రియుడికి భార్య సందేశాలు పంపిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, మహబూబాబాద్‌కు చెందిన రాజేశ్వర్‌కు 2016లో భవానీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల భవానీ స్థానిక కొరియర్ బాయ్ సైదులుతో సన్నిహితంగా ఉంటున్నట్లు రాజేశ్వర్ గుర్తించడంతో కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో భవానీ తన ప్రియుడు సైదులుకు పంపినట్లు చెబుతున్న సందేశాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. “ఇంట్లో చంపొద్దు.. బయట ప్రమాదంలా కనిపించేలా చేయించి చంపించు.. లేదంటే నేను చనిపోతాను” అనే సందేశాలు కేసులో కీలకంగా మారాయి.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి, మెసేజ్‌ల ప్రామాణికత, ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. కుట్ర కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.





























