[t4b-ticker]

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, ఆగస్టు 23: ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆటో కార్మికులకు విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలమని స్పష్టం చేశారు.

2015 తర్వాత రాష్ట్రంలో ఆటో చార్జీలను పెంచలేదని మంత్రి తెలిపారు. ఈ కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఆటో వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఆటో కార్మికుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలను భాగస్వామ్యం చేసి అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించిన అనంతరం న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించి త్వరలో బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆటో కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో కార్మికులపై నిర్వహణ వ్యయ భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను విద్యుత్ ఆటోలుగా మార్చే పునరుద్ధరణ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. పాత ఆటోలను విద్యుత్ వాహనాలుగా మార్చుకునే వారికి ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు.

అదేవిధంగా పాత ఆటోను తుక్కుగా మార్చి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో దశలవారీగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోల స్థానంలో విద్యుత్ ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనివల్ల నగరంలో కాలుష్యం తగ్గడంతో పాటు ఆటో కార్మికుల ఇంధన ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏ విధానంతో వారికి మరింత ప్రయోజనం కల్పించవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. అర్హత కలిగిన ఆటో కార్మికుల కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ కార్యక్రమాల్లో అర్హత ఉన్న ఆటో కార్మికుల కుటుంబాలకు కూడా ప్రయోజనం కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి వివరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించిన విధంగానే ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను కూడా చర్చల ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సమ్మెకు వెళ్లడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నందున ఆటో కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని చర్చలకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రస్తుతం తాను హుస్నాబాద్‌లో ఉన్నందున అక్కడి నుంచే ఆటో కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకుని సమ్మెకు వెళ్లకుండా సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆయన కోరారు.

Spread the love

Related News

Latest News