ప్రతిపక్షం, ఆగస్టు 28: రాఖీ పండుగ సందర్భంగా సోదరుడి చేతికి రక్షాబంధనం కట్టేటప్పుడు ప్రత్యేక మంత్రాన్ని పఠించడం సంప్రదాయంగా వస్తోందని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రం ద్వారా సోదరుడికి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుతూ రక్షణ భావాన్ని వ్యక్తం చేస్తారని తెలిపారు.
రాఖీ కట్టే సమయంలో “యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః.. తేన త్వాం ప్రతిబధ్నామి రక్షే మా చల మా చల” అనే మంత్రాన్ని పఠించవచ్చని పండితులు సూచిస్తున్నారు.
ఈ మంత్రానికి పురాణ నేపథ్యం ఉందని వారు చెబుతున్నారు. మహాబలవంతుడైన బలి చక్రవర్తిని ఏ రక్షాసూత్రంతో బంధించారో, అదే పవిత్రమైన రక్షాసూత్రంతో తాను సోదరుడిని బంధిస్తున్నాననే భావం ఇందులో ఉంటుందని వివరించారు.
“ఓ రక్షా సూత్రం.. నువ్వు స్థిరంగా ఉండి, నిన్ను ధరించిన వ్యక్తికి ఎల్లప్పుడూ రక్షణగా నిలవాలి” అనేది ఈ మంత్రం భావమని పండితులు తెలిపారు. రాఖీ కేవలం దారం కట్టే సంప్రదాయం మాత్రమే కాకుండా.. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధం, పరస్పర రక్షణకు ప్రతీకగా భావిస్తారని చెప్పారు.
రాఖీ కట్టే సమయంలో సోదరి ఈ మంత్రాన్ని పఠిస్తూ సోదరుడి క్షేమాన్ని కోరుకోవడం ద్వారా పండుగకు మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యం చేకూరుతుందని పండితులు పేర్కొన్నారు.





























