ప్రతిపక్షం, సెప్టెంబర్ 04: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం దౌల్తాబాద్‌కు చేరుకోనున్న సీఎం.. స్థానికంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అనంతరం హకీంపేట్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించనున్నారు.
ప్రాంతంలో చేపడుతున్న పనుల ప్రస్తుత పరిస్థితి, నిర్మాణాల పురోగతి, ప్రజలకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించే అవకాశం ఉంది.
ఇవాళ్టి పర్యటన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి రాత్రి కొడంగల్‌లోనే బస చేయనున్నారు. మరుసటి రోజు నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు కొడంగల్‌లో నిర్మించిన ఆర్అండ్బీ అతిథి గృహాన్ని ప్రారంభించనున్నారు. అలాగే 220 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని కూడా ప్రారంభించనున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు కీలక భవనాల ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొననుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పర్యటన పూర్తైన అనంతరం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.





























