ప్రతిపక్షం, సెప్టెంబర్ 04, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. రాతపూర్వక సమాధానాన్ని సమర్పించాలని సూచించింది. రేపటిలోపు సమాధానం ఇవ్వాలని కమిటీ గడువు విధించింది.
గత మార్చి 29న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై వివాదం నెలకొంది. సభా కార్యక్రమాల సందర్భంగా ఆయన ప్రవర్తనపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీ పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై గత ఆగస్టు 29న ఎథిక్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. సమావేశంలో కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసి, ఆయన నుంచి రాతపూర్వక వివరణ తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే తాజాగా నోటీసులు జారీ చేసిన కమిటీ.. నిర్ణీత గడువులోగా తన వివరణను అందించాలని ఆదేశించింది.
కౌశిక్ రెడ్డి ఇచ్చే సమాధానాన్ని పరిశీలించిన అనంతరం ఎథిక్స్ కమిటీ తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.





























