[t4b-ticker]

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి: కవిత

ప్రతిపక్షం, సెప్టెంబర్ 09: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగ అభ్యర్థులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. పోలీసు ఉద్యోగాల నియామకాల్లో వయోపరిమితిని పెంచడంతో పాటు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు ఆమెను కోరారు. ప్రస్తుతం నోటిఫికేషన్‌ ఇచ్చిన పోస్టుల సంఖ్యను పెంచి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 20 వేల కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలిచారని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఉద్యోగాల భర్తీ విషయంలో ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని విమర్శించారు.

2024లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వస్తుందంటూ ప్రచారం చేసి జీవో నంబర్‌ 31ను విడుదల చేశారని కవిత పేర్కొన్నారు. వయోపరిమితిపై సడలింపు ఇస్తామని చెప్పడంతో అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారని, కానీ రెండేళ్ల పాటు సమయం గడిచిపోయిందని అన్నారు. ఈ కాలంలో అనేక మంది నిరుద్యోగులు గరిష్ఠ వయోపరిమితిని దాటిపోవడంతో పోలీసు ఉద్యోగాలకు అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసు ఉద్యోగాల కోసం సాధారణంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఈసారి వయోపరిమితిని పెంచకపోవడంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని కవిత అన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సుమారు తొమ్మిది లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండగా, ఈసారి మూడు నుంచి నాలుగు లక్షల దరఖాస్తులకే పరిమితమయ్యాయని ఆమె పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం వయోపరిమితి సమస్యేనని అభిప్రాయపడ్డారు.

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు వయోపరిమితిని తప్పనిసరిగా పెంచాలని కవిత డిమాండ్‌ చేశారు. ఎస్సై ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 38 ఏళ్లకు, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 36 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలా వయోపరిమితి సడలింపు కల్పిస్తే మరో రెండు నుంచి మూడు లక్షల మంది నిరుద్యోగులకు అవకాశం లభించే పరిస్థితి ఉంటుందని అన్నారు.

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం ఏడు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇవ్వడంపై కవిత ప్రశ్నలు సంధించారు. సుమారు 20 వేల కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఏడు వేల పోస్టులతో ఎందుకు సరిపెడుతున్నారని నిలదీశారు. పోలీసు శాఖలో ఖాళీలను పూర్తిస్థాయిలో గుర్తించి, అవసరమైన మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

హోంశాఖ ఒక విధంగా చెబుతుంటే ప్రభుత్వం మరో విధంగా ప్రకటనలు చేస్తోందని కవిత విమర్శించారు. ప్రభుత్వంలోని విభాగాల మధ్యే సమన్వయం కనిపించడం లేదని అన్నారు. వయోపరిమితి పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు.

పోలీసు ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా సిద్ధమవుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని కవిత కోరారు. వయోపరిమితి కారణంగా అర్హత కోల్పోయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని, వారి డిమాండ్ల సాధన కోసం మద్దతు కొనసాగిస్తామని కవిత హామీ ఇచ్చారు.

Spread the love

Related News

Latest News