ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలన్నీ వెల్లడించా
వ్యవసాయం తప్ప అక్కడ ఏమీ లేదు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, సెప్టెంబర్ 18: తనపై బురద చల్లేందుకే ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలన్నీ వెల్లడించానని తెలిపారు. సిద్ధిపేటలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు.తన వ్యవసాయ భూమిపై వస్తున్న ఆరోపణలకు మీడియా ప్రతినిధులు స్వయంగా వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని హరీశ్ రావు అన్నారు. ఒక రోజు మీడియా ప్రతినిధులకు భోజనం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అక్కడి పరిస్థితులను స్వయంగా చూపిస్తానన్నారు.వాస్తవాలను చూసి ప్రజలకు వివరించాలని కోరారు.
అక్కడ వ్యవసాయం తప్ప ఏమీ లేదు
తన భూమిలో వ్యవసాయం తప్ప మరేమీ లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.విలాసవంతమైన నిర్మాణాలు లేవని అన్నారు.తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.2018లో తొలిసారి ఒక ఎకరం భూమి కొనుగోలు చేశానని తెలిపారు. ఆ తర్వాత విడతల వారీగా భూమిని కొనుగోలు చేశానన్నారు. 2024 వరకు మొత్తం 13 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు చెప్పారు. తాను భూమిని కొనుగోలు చేసిన వివరాలు అధికారికంగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అధికారులు తన భూమికి హద్దులు చూపించారని చెప్పారు.అధికారులే సర్వే చేసి భూమి హద్దులను స్పష్టం చేశారని పేర్కొన్నారు.
నాకోసం ప్రత్యేకంగా రోడ్డు వేయలేదు
తన భూమి కోసం ప్రత్యేకంగా కొత్త రోడ్డు వేయలేదని హరీశ్ రావు అన్నారు. గతంలో ఉన్న రోడ్డు స్థానంలోనే కొత్త రోడ్డు నిర్మించారని తెలిపారు.ఈ రోడ్డు నిర్మాణం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. సిద్ధిపేట పట్టణాభివృద్ధి సంస్థ(సుడా) నిధులతో రోడ్డు వేయలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా పాత రహదారి దెబ్బతినడంతో కొత్త రహదారి నిర్మించారని తెలిపారు. ఇది తన కోసం ప్రత్యేకంగా నిర్మించిన రహదారి కాదని పేర్కొన్నారు.
హరీశ్‌రావు బెదిరిస్తే ప్రజలు ఊరుకుంటారా?’
తాను ఎవరినైనా బెదిరిస్తే ప్రజలు ఊరుకుంటారా అని హరీశ్ రావు ప్రశ్నించారు.ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారన్నారు. తనపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
మియావాకీ ప్లాంటేషన్ మాత్రమే
తన భూమి సమీపంలో మియావాకీ విధానంలో మొక్కలు నాటినట్లు హరీశ్‌రావు తెలిపారు.అది పార్కు కాదని స్పష్టం చేశారు. మొక్కల పెంపకం కోసమే అక్కడ చెట్లు నాటామని చెప్పారు.మియావాకీ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటినట్లు తెలిపారు.కేవలం సిద్ధిపేటలోనే ఈ కార్యక్రమం జరగలేదని అన్నారు. దీనిని పార్కుగా చిత్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై మీడియా స్వయంగా పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని హరీశ్ రావు కోరారు.





























