యూపీఎస్ కాజిపల్లి ప్రధానోపాధ్యాయుడు చెదల భాస్కర్
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, సెప్టెంబర్ 19: విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర రంగాల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడంలో తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని యూపీఎస్ కాజిపల్లి ప్రధానోపాధ్యాయుడు చెదల భాస్కర్ అన్నారు.
శనివారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే దిశగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.
విద్యార్థుల ముందు ఆర్థిక సమస్యలు, కుటుంబ విభేదాలు వంటి అంశాలను చర్చించకుండా వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని కోరారు. ఆధునిక సమాజంలో టీవీ, సెల్‌ఫోన్‌ల వినియోగాన్ని తగ్గించి, చదువుకునే సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. హోంవర్క్, చదువుకు ప్రత్యేక సమయం కేటాయించడం ద్వారా విద్యార్థుల ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గంట మీనా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






























