Trending Now

ప్రజల పక్షాన ‘ప్రతిపక్షం’..

ఘనంగా ‘ప్రతిపక్షం’ డిజిటల్ మీడియా ఆవిష్కరణ..

(ప్రతిపక్షం స్టేట్​ బ్యూరో)

హైదరాబాద్, మార్చి 21: ‘ప్రతిపక్షం’ లేకుంటే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందని తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ కె. శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. పాత ప్రెస్ క్లబ్ దేశోద్ధారక భవన్ లో గురువారం ఆయన ‘ప్రతిపక్షం’దినపత్రిక, డిజిటల్ మీడియాను​ అవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్​, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్​ ఘంటా చక్రపాణి, టీయూడబ్ల్యూజే–ఐజేయూ ప్రధాన కార్యదర్శి విరాహత్​ అలీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షం’ పత్రిక ఆకర్షనీయంగా, ఆదర్శనీయంగా ఉందని కొనియాడారు. వృత్తి నైపుణ్యం కనబడుతోందన్నారు. పత్రిక ఇలాగే కొనసాగితే ప్రజలను ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. ‘ప్రతిపక్షం’ ప్రజలతో కలిసి ముందడుగు వేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో రాజకీయాలు ప్రమాదం అంచున ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నేతలు తమ వ్యాపారాలు దెబ్బతినకుండా ఉండేందుకే రాజకీయాలు నెరుపుతామని బాహాటంగానే ప్రకటించడం విచారకరమన్నారు.

ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. ప్రజా స్వామ్యంలో నాలుగవ స్తంభంగా ఉన్న మీడియా ప్రజల భావాలను ప్రతిబింబించేందుకు నిరాకరిస్తున్నాయని గుర్తు చేశారు. దేశ రాజధానిలో , గ్రామాలు, పట్టణాలలో ప్రదర్శనలు చేస్తున్నవాళ్లు పర్యాటకులు కాదని అన్నారు. తమ జీవితం కొనసాగించేందుకు ప్రదర్శనలు చేస్తున్నారని, ఆ విషయాన్ని మీడియా వెల్లడించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఇంగ్లిష్​. హిందీ ప్రాంతీయ భాషల మీడియా కార్పొరేట్​ శక్తుల గుప్పిటనే నడుస్తున్నాయన్నారు. స్వేచ్ఛ పేరిట సోషల్​ మీడియాలో ఉచ్చరించడానికి వీలుకాని భాషను ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరమున్నదని అన్నారు. స్వేచ్ఛ మంచిదే కానీ, అది బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. ప్రింట్​, ఎలక్రానిక్​, సోషల్​ మీడియాకు ఎథిక్స్​ అవసరమని సూచించారు. ‘ప్రతిపక్షం’ పత్రిక ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షించారు.

కత్తిమీద సామే!

ప్రస్తుత పరిస్థితులలో ప్రింట్​ మీడియాను నడుపడం కత్తి మీద సాములాంటిదని దేవులపల్లి అమర్ అన్నారు. అలాంటి సాహసానికి పూనుకున్న పత్రిక యాజమాన్యం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు. సంపాదకుడికి విశిష్ఠ అనుభవం ఉందని , ఆ ఆనుభవంతో ప్రజా సమస్యలను పత్రిక ద్వారా వెల్లడించాలని కోరారు. గతంలో పత్రికలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేటివని, నేడు యజమానుల చేతులకు పత్రికా స్వేచ్ఛ వెళ్లిందని అన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. నిష్పక్షపాతంగా ప్రజలకు వార్తలను చేరవేయాలని కోరారు.

ఇప్పటి పోటీరంగంలో ‘ప్రతిపక్షం’ పత్రిక తీసుకురావడం సాహసమేనని ప్రొఫెసర్​ ఘంటా చక్రపాణి అన్నారు. పత్రికలు ‘ప్రజాపక్షం’గా ఉండి వారి సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లేలా ఉండాలన్నారు. నేటి పరిస్థితులలో ప్రజా సమస్యలు పత్రికలలో రావడం లేదన్నారు. సోషల్​ మీడియా ప్రజల గొంతుకగా మారిందన్నారు. మీడియా రంగంలోకి అనేక యూట్యూబ్ చానళ్లు ప్రవేశించాయన్నారు. దేశంలో 200 ప్రధాన మీడియా సంస్థలను ఎనిమిది కుటుంబాలు శాసిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పత్రిక ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజల పక్షాన ఉండాలని సూచించారు.

ప్రజల గొంతుకగా ఉండాలి..

‘ప్రతిపక్షం’ మీడియా ప్రజల గొంతుకగా నిలబడాలని విరాహత్​ అలీ అన్నారు. వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పట్టుదల గల జర్నలిస్టుల జాబితాలో రహమాన్​ ఒకరుగా నిలిచారని అన్నారు. సోషల్​ మీడియా పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలని అన్నారు. ‘ప్రతిపక్షం’ మీడియా ప్రజల పక్షాన మీడియా నిలుస్తుందని సంపాదకులు పజుల్ రహమాన్​ అన్నారు. విలువలు, బాధ్యతతో కూడిన మంచి పత్రికగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆవిష్కరణ ఎడిటోరియల్​ లో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా వృత్తి నైపుణ్యానికి, విలువలకు తమ మీడియాను వేదికగా నిలుపుతామని అన్నారు. ప్రజల పత్రిగా తీర్చిదిద్ది వారి మన్ననలు పొందుతామని అన్నారు.

Spread the love

Related News

Latest News