CM Revanth said Yadadri Development With Module of TTD Board: టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలన్నారు.
అలాగే, హెల్త్, ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆలయ పనులు అనవసరంగా ఆపవద్దని, ఆలయ గజగోపురానికి బంగారు తాపడం వంటి పనులు వేగవంతం చేయాలన్నారు. భక్తులకు సౌకర్యాలు, వసతికి సంబంధించిన పనులపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలన్నారు. ఆలయ అభివృద్ధిని మరోస్థాయికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.