ప్రతిపక్షం, జూలై 27: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో పదో తరగతి విద్యార్థిని శివాని ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కేవలం మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో ధైర్యంగా మాట్లాడి, భవిష్యత్తులో “షైనింగ్ స్టార్”గా ఎదిగి మీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటానని చెప్పిన శివాని.. ఇప్పుడు విగతజీవిగా మారడం అందరినీ కలచివేస్తోంది.
ఈ నెల 24న సీఎం చంద్రబాబు రంపచోడవరం పర్యటన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇర్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని శివాని తన చురుకుదనంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మాటలకు ముగ్ధుడైన సీఎం చంద్రబాబు, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. ఆమెతో కలిసి భోజనం చేసి సెల్ఫీ కూడా దిగారు.
అయితే, ఆదివారం శివాని ఆత్మహత్యకు పాల్పడింది. మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్‌లో కుటుంబ కలహాల వల్ల తాను తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నట్లు పేర్కొంది. “అమ్మా, నాన్నా.. మీ కోసం ఎంతో చేయాలని అనుకున్నాను. కానీ చేయలేకపోతున్నాను. బతకాలనే ఉంది.. కానీ ఈ బాధను భరించలేకపోతున్నాను” అని ఆవేదన వ్యక్తం చేసింది.
అలాగే తన చివరి కోరికగా కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని, అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ ఒకరినొకరు ద్వేషించకుండా కలిసిపోవాలని కోరింది. “మీరు ఎప్పటికైనా ఒక్కటిగా ఉండండి” అంటూ భావోద్వేగంగా లేఖ రాసి జీవితానికి ముగింపు పలికింది.
మూడ్రోజుల క్రితం ఆశయాలతో, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు గురించి మాట్లాడిన విద్యార్థిని ఇలా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమా? లేక మరేదైనా అంశం ఉందా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.


















