పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం.. లోక్‌సభలో కీలక సవరణ బిల్లు

ప్రతిపక్షం, జూలై 27: ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల్లో అవకతవకలను కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభ ముందుంచారు.

ఈ బిల్లు ద్వారా 2024 చట్టంలో ఏడు కీలక సవరణలను ప్రతిపాదించారు. పరీక్షా పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్, సంఘటిత పరీక్షల మోసాలను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.

సవరణల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్షలకు సంబంధించిన కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఛార్జ్‌షీట్ దాఖలైన మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని, దర్యాప్తును రెండు నెలల్లో ముగించాలని బిల్లులో ప్రతిపాదించారు.

అదనంగా పరీక్షల నేరాల దర్యాప్తు కోసం కేంద్రం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసే అధికారం పొందుతుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించడంతో పాటు, నేరస్థులకు మరింత కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించే నిబంధనలను చేర్చారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌లలో కాలపరిమితితో అప్పీళ్ల విచారణ జరిగే విధానాన్నీ బిల్లులో ప్రతిపాదించారు.

ఇదిలా ఉండగా, విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యలను నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన కొనసాగించిన నేపథ్యంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం మాత్రం పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవడానికే ఈ సవరణలు తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది.

Spread the love

Related News

Latest News