ప్రతిపక్షం, జూలై 28: అస్సాంను ముంచెత్తుతున్న వరదల మధ్య తండ్రి ప్రేమ, త్యాగానికి నిదర్శనంగా నిలిచే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రాణాపాయం మధ్య కూడా తమ పిల్లలను సురక్షితంగా కాపాడేందుకు తండ్రులు చేస్తున్న ప్రయత్నాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.
ఒక ఘటనలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్నారులను చిన్న తెప్పలో కూర్చోబెట్టి, తాను వరద నీటిలో ఈదుతూ ఆ తెప్పను ముందుకు నడిపించి సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. మరో వీడియోలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని లెక్కచేయకుండా, తన బిడ్డను ఒక చేత్తో పైకెత్తుకుని నీటిని దాటిస్తూ ప్రాణాలు కాపాడాడు.
ఈ దృశ్యాలు తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేస్తున్నాయి. పిల్లల కోసం ఎలాంటి కష్టాన్నైనా భరించే, అవసరమైతే ప్రాణాలనే పణంగా పెట్టే తండ్రి ప్రేమకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. “నాన్నే నిజమైన హీరో”, “పిల్లల కోసం తండ్రి చేసే త్యాగానికి సాటిలేదు” అంటూ వేలాది మంది భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు.

















