సొంత అల్లుడు, మనుమడే మాస్టర్‌మైండ్లు
మీరట్‌కు చెందిన ముగ్గురు అరెస్ట్
రూ.2.09 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 29: కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన ఇంటి డెకాయిటీ కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాధితుడి సొంత అల్లుడు రజావుద్దీన్, మనుమడు అజీమ్ రజానే ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. కరీంనగర్ లో మీడియా సమావేశం లో సీపీ గౌస్ ఆలం మాట్లాడారు. సీపీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి డెకాయిటీ
భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
- సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో ఛేదన
ఘటనా స్థలం పరిసరాలు, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించిన పోలీసులు, వారు దోచుకున్న ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుల జాడను మీరట్ వరకు గుర్తించారు.
- మీరట్‌లో ముగ్గురు అరెస్ట్
కరీంనగర్ ప్రత్యేక పోలీసు బృందాలు మీరట్ వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చేపట్టాయి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
- అరెస్టయిన నిందితులు
సల్మాన్ @ భూరే @ యాదవ్ (22) – రూ.84,000 నగదు, 11.95 గ్రాముల బంగారం స్వాధీనం. సల్మాన్ @ విమాన్ (22) – రూ.67,000 నగదు, 11.71 గ్రాముల బంగారం స్వాధీనం.మొహమ్మద్ హసీన్ (19) – రూ.58,000 నగదు, 14.01 గ్రాముల బంగారం స్వాధీనం.మొత్తం స్వాధీనం: రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలుసొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులుదర్యాప్తులో బాధితుడి అల్లుడు రజావుద్దీన్ (A1), మనుమడు అజీమ్ రజా (A2) ఈ డెకాయిటీకి మాస్టర్‌మైండ్లుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మామ వద్ద రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసిన రజావుద్దీన్, నిరాకరణకు గురికావడంతో ప్రతీకారంతో ఈ దోపిడీకి పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది.కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి సమాచారం సేకరించిన రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా, మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి ఈ నెల 20న మీరట్ నుంచి రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి డమ్మీ పిస్టళ్లు, కత్తులతో డెకాయిటీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
- ప్రధాన నిందితుల కోసం గాలింపు
అరెస్టయిన ముగ్గురు నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు రజావుద్దీన్ (A1), అజీమ్ రజా (A2)తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

















