- రూ.26 లక్షల ఇంటి చోరీ కేసు ఛేదన
- రూ.17.60 లక్షల నగదు, కారు, మొబైల్ స్వాధీనం.. ఒకరు అరెస్ట్, మరో నిందితురాలు పరారీ
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 29: కరీంనగర్ రూరల్ పోలీసులు భారీ ఇంటి చోరీ కేసును ఛేదించి ప్రధాన నిందితుడు తగరం శంకర్‌లాల్‌ను అరెస్ట్ చేశారు. తన చిన్ననాటి స్నేహితుడు, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుడిమల్ల శ్రీనివాస్ ఇంట్లో దాచిన రూ.26 లక్షల నగదును దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది.పోలీసుల కథనం ప్రకారం, ఫిర్యాదుదారుడి ఇంటి వివరాలు, అదనపు తాళంచెవి ఉంచే ప్రదేశం, ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉన్న విషయం తెలిసిన శంకర్‌లాల్ ఆర్థిక ఇబ్బందులతో దొంగతనానికి పథకం రచించాడు. పరారీలో ఉన్న రేష్మతో కలిసి ఇంట్లోకి చొరబడి రూ.26 లక్షల నగదును అపహరించాడు.బొమ్మకల్ బస్‌స్టాప్ సమీపంలో వాహనాల తనిఖీల సందర్భంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి రూ.17.60 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ కారు, శాంసంగ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితురాలు రేష్మ పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది.ఈ కేసును విజయవంతంగా ఛేదించిన కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్‌రెడ్డి, ఎస్‌ఐ ఎ. లక్ష్మారెడ్డి తదితర పోలీసు బృందాన్ని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు. ప్రజలు భారీ మొత్తంలో నగదు, విలువైన ఆభరణాలను ఇళ్లలో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీసులు సూచించారు.

















