రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, జూలై 30: వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఇన్ఫ్లో ఆలస్యంగా వస్తున్నా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 4,051 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1,065 అడుగులు 16.405 టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1.075 అడుగులు 32.897 టీఎంసీల నీటి నిలువ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్టులో 16 టీఎంసీలు తక్కువగా నీటి నిల్వ ఉంది. కాగా, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు చేరుతోంది.
రైతులు హర్షం..
జిల్లాలో లక్షల ఎకరాల్లో వరి పంట, 1.83 లక్షల ఎకరాల్లో వర్షాధార రకాల పంటలు సాగుపుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా 1.20 లక్షల ఎకరాల్లో నాట్లు వేసేందుకు భూములు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఎల్ నినో ముప్పు పొంచి ఉందని, వర్గాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటలు సాగు చేయాలని, వరికి బదులు ఆరుతడి పంటలు సాగు లాభదాయకమంటూ రైతులకు ప్రభుత్వం విన్నతంగా అవగాహన కల్పించారు. అయినా రైతులు ఎప్పటిలాగే పరిసాగుకు మొగ్గు చూపారు. బోరుబావుల ఆధారంగా జిల్లాలో ఖరీఫ్ పంటలు వేసిన రైతులు మొన్నటివరకు వర్షాలు లేక బిక్కు బిక్కుమంటూ వర్షాల కొరకు ఎదురు చూశారు. గత వారం రోజుల నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో రైతులకు ఉపశమనం లభించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ పరిధిలోని ఆయకట్టు రైతులు ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్నారు.


















