ప్రతిపక్షం, జూలై 30, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఈ విమానానికి ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యంగా లభించడంతో పైలట్ విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లి సుమారు 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టారు.
సమాచారం ప్రకారం, బుధవారం సాయంత్రం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో విమానానికి వెంటనే రన్‌వే క్లియరెన్స్ లభించలేదు. దీంతో భద్రతా నిబంధనల ప్రకారం పైలట్ విమానాన్ని మళ్లీ ఎగురవేసి గాల్లో హోల్డింగ్ ప్యాటర్న్‌లో ఉంచారు.
అనంతరం అవసరమైన అనుమతులు లభించడంతో రాత్రి 8:30 గంటల తర్వాత విమానం సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 229 మంది ప్రయాణికులు క్షేమంగా దిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి సాంకేతిక లోపం లేదా భద్రతా సమస్య లేదని, ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యమవడం వల్లే విమానం కొద్దిసేపు గాల్లోనే వేచి ఉండాల్సి వచ్చిందని విమానయాన వర్గాలు పేర్కొన్నాయి.
















