ప్రతిపక్షం, జూలై 30, హైదరాబాద్: మధ్యతరగతి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను ప్రతిబింబిస్తూ ఓ నెటిజన్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెల జీతం వచ్చినా చేతిలో మిగిలేది ఏమీ లేదని, ఈఎంఐలు, ఇంటి అద్దె, కుటుంబ ఖర్చులతో జీవితం భారంగా మారిందంటూ వ్యక్తం చేసిన ఆవేదన వేలాది మందిని ఆలోచింపజేస్తోంది.
వీడియోలో మాట్లాడిన ఉద్యోగి.. జీతం వచ్చిన కొద్ది రోజుల్లోనే బ్యాంకు ఈఎంఐలు, ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులతో మొత్తం డబ్బు ఖాళీ అయిపోతోందని వాపోయాడు. ఒకప్పుడు వారానికి ఒకసారి మటన్ తీసుకురావడం సాధారణమైతే, ఇప్పుడు ఆలోచించి కొనాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు.
పెళ్లి, పిల్లల బాధ్యతలు పెరిగిన తర్వాత ఖర్చులు మరింత అధికమయ్యాయని, ఎంత కష్టపడి పనిచేసినా జీవితంలో ఎలాంటి ఆర్థిక పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి నెల జీతం కోసం ఎదురుచూడటం, వచ్చిన వెంటనే అప్పులు, బిల్లులు తీర్చడం మాత్రమే జీవితంగా మారిపోయిందని పేర్కొన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. అనేక మంది ఉద్యోగులు “ఇది మా జీవిత కథే”, “మా మనసులోని బాధనే చెప్పాడు”, “జీతం పెరగడం లేదు.. ఖర్చులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి” అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, గృహ అద్దెలు, రుణ భారం, విద్యా, వైద్య ఖర్చులు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీతాల పెరుగుదల కంటే ద్రవ్యోల్బణం వేగంగా పెరగడం వల్ల చాలా మంది ఉద్యోగులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విశ్లేషిస్తున్నారు.

















