[t4b-ticker]

ప్రభుత్వ విద్యార్థిపై ఏడాదికి రూ.1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ బాట ఎందుకు?: సీఎం రేవంత్

ప్రతిపక్షం, హైదరాబాద్, జులై 30: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయినప్పటికీ తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యాసంస్థల కంటే ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకే ప్రాధాన్యం ఇవ్వడం ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను మరింత నాణ్యంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు సగటున రూ.50 వేల వరకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని, అయితే ప్రభుత్వం దానికి రెండింతలకు పైగా వ్యయం చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరగడం లేదని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యను ప్రజలకు మొదటి ఎంపికగా మార్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యాశాఖ, ప్రభుత్వం అందరిపైనా ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక విద్య అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచాలని సూచించారు.

డ్రాప్‌అవుట్ల అంశాన్ని ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువును మధ్యలోనే మానేసేవారని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందని, విద్యార్థులను పాఠశాలల్లో కొనసాగించే దిశగా చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు.

ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News