[t4b-ticker]

ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం.. స్కిల్స్‌తో తెలంగాణ విద్యార్థులకు కొత్త దారి: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 30, హైదరాబాద్: మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా రూపాంతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందించిన అనంతరం విద్యార్థులను స్కిల్ ఆధారిత ఉపాధి అవకాశాల వైపు మళ్లించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. భవిష్యత్ తరాల జీవితాలను మార్చే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని పేర్కొంటూ, వచ్చే ఐదేళ్లు విద్యా రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ దాశరథి ఆడిటోరియంలో నిర్వహించిన “టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్” కార్యక్రమంలో ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశాల్లోని విద్యా విధానాల అనుభవాలను తెలంగాణలో అమలు చేయాలని సూచించారు.

సాంప్రదాయ విద్యతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. 12వ తరగతి పూర్తయ్యే సమయానికి విద్యార్థులకు ప్రపంచ పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం బాధ్యతగా పరిష్కరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. బదిలీలు, పదోన్నతులు అడగకుండానే కల్పించామని, డీఎస్సీ ద్వారా కేవలం 55 రోజుల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని గుర్తుచేశారు. ఇకపై ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యల కంటే విద్యార్థుల భవిష్యత్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు.

వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన మార్పులు, సంస్కరణలపై డిసెంబర్ నాటికి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి మండలాన్ని ఒక విద్యా క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. విద్యతో పాటు క్రమశిక్షణ కూడా సమానంగా అవసరమని చెప్పారు.

ప్రపంచ స్థాయి అవకాశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించిన సీఎం, ఇప్పటివరకు అమెరికాపైనే ఎక్కువ దృష్టి పెట్టామని, ఇకపై జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, చైనా వంటి దేశాల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించాలని అన్నారు. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, ఆ దేశాల భాషపై ప్రాథమిక పరిజ్ఞానం, తగిన స్కిల్స్ ఉంటే లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు.

సంక్షేమ పథకాలు అవసరమే అయినప్పటికీ, సమాజంలో శాశ్వత మార్పు తీసుకురాగల శక్తి విద్యకే ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇళ్లు, పెన్షన్లు, రేషన్ వంటి పథకాలను కొనసాగిస్తూనే, ప్రతి కుటుంబంలో ఒక డాక్టర్, ఇంజనీర్, నైపుణ్యంతో కూడిన యువకుడిని తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెబుతూ, బడ్జెట్‌లో దాదాపు 9 శాతం నిధులను విద్య కోసం కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 27.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతుండగా, ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ స్థాయిలో పెట్టుబడి పెడుతున్నప్పుడు విద్యా నాణ్యత కూడా అదే స్థాయిలో ఉండాలని ఉపాధ్యాయులను కోరారు.

గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయని సీఎం తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో లక్షకు పైగా కొత్త విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పారు. గతంలో దేశంలో విద్యా రంగంలో 28వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 18వ స్థానానికి చేరుకోవడం ప్రభుత్వ దృష్టి, ఉపాధ్యాయుల కృషి ఫలితమని కొనియాడారు.

విద్యా సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలకు కూడా సీఎం స్పందించారు. నర్సరీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ప్రారంభించడం, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందించడం, 23 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 30 వేల మందికి పైగా బదిలీలు కల్పించడం వంటి చర్యలు తీసుకున్న ప్రభుత్వం రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు.

సమావేశానికి ముందు ఫిన్లాండ్, జర్మనీ పర్యటనలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ముఖ్యమంత్రి వీక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, ఉన్నతాధికారులు, విద్యాశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News