[t4b-ticker]

హైడ్రాపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ‘వ్యక్తుల పాలన కాదు.. చట్టపరమైన పాలనే కొనసాగాలి’

ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: హైడ్రా వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతాశ్రీరామ్‌ కంపెనీకి సంబంధించిన వివాదంలో హైడ్రా చేపట్టిన చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు కూడా తీర్పు కాపీలో పేర్కొంది.

ఈ నెల 27న ఇచ్చిన తీర్పు కాపీని హైకోర్టు తాజాగా విడుదల చేసింది. వివాదాస్పద భూమిలో హైడ్రా అధికారులు చేపట్టిన చర్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి చర్యలు తీసుకోవడం న్యాయవ్యవస్థ ఆదేశాలను ధిక్కరించినట్లేనని పేర్కొంది.

ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాత్రపైనా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రంగనాథ్ స్థానంలో మరో అధికారిని నియమించాలని సీఎస్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు తీర్పులో పాలనకు సంబంధించిన అంశాలపై కూడా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. చట్టపరమైన పాలనే కొనసాగాలని.. వ్యక్తుల పాలనకు, వ్యక్తుల ఆధిపత్యానికి చోటు ఉండకూడదని వ్యాఖ్యానించింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతుందని, చివరకు ప్రజాస్వామ్యానికి మరణశాసనం వంటిదవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ సంస్థలు, అధికారులు కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా గౌరవించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారుల చర్యలు చట్టపరమైన పరిధిలోనే ఉండాలని, వ్యక్తిగత నిర్ణయాలు లేదా అధికార దుర్వినియోగానికి అవకాశం ఉండకూడదని పేర్కొంది.

శాంతాశ్రీరామ్‌ కంపెనీకి సంబంధించిన భూ వివాదంలో హైడ్రా చర్యలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా తీర్పు పూర్తి కాపీ వెలువడటంతో హైడ్రా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Spread the love

Related News

Latest News