[t4b-ticker]

నిండుకున్న శ్రీపాద ఎల్లంపల్లి

కాంగ్రెస్ దూరదృష్టికి నిదర్శనం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 31: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద జలాలతో కళకళలాడుతుండడం కాంగ్రెస్ ప్రభుత్వాలు రూపొందించిన శాస్త్రీయ ప్రణాళికలకు నిదర్శనమని, ఈ పరిణామంతో బీఆర్ఎస్ నాయకులు సంవత్సరాలుగా ప్రజలను నమ్మించిన అబద్ధాలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.శుక్రవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ… భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయిలో నిండిందని, అక్కడి నుంచి మిడ్ మానేరు, లోయర్ మానేరు సహా దిగువన ఉన్న రిజర్వాయర్లకు నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రావిటీ ఆధారిత వరద కాలువలతో రూపొందించిందని తెలిపారు. అందువల్లే ఈరోజు ఎలాంటి ఎత్తిపోతల అవసరం లేకుండానే వరద జలాలు సహజసిద్ధంగా ఎల్లంపల్లికి చేరాయని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున హంగామా చేశారని, కానీ ఎలాంటి పంపింగ్ అవసరం లేకుండానే ఎల్లంపల్లి జలాశయం నిండిపోవడంతో వారి వాదనలు పూర్తిగా తేలిపోయాయని అన్నారు. “మా వల్లే నీళ్లు వచ్చాయి” అంటూ గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ నాయకుల మాటలకు ప్రకృతి స్వయంగా సమాధానం చెప్పిందని వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి హరీష్ రావు నెల రోజుల సమయం ఇస్తే నీటిని ఎత్తిపోస్తానని గొప్పలు చెప్పారని, కానీ ఈరోజు ఎలాంటి లిఫ్టులు లేకుండానే నీరు ఎల్లంపల్లికి చేరిందని గుర్తుచేశారు. ఇప్పుడు హరీష్ రావు తన వ్యాఖ్యలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి అన్నారు.ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన బీఆర్ఎస్ ప్రజల కష్టసుఖాలను పక్కనపెట్టి రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు నష్టపోవాలని, ప్రజలు ఇబ్బందులు పడాలని కోరుకుంటోందని మంత్రి తీవ్రంగా విమర్శించారు. వర్షాలు బాగా కురిస్తే ఓర్వలేకపోవడం, రైతులు ఆనందంగా నాట్లు వేస్తుంటే బాధపడటం బీఆర్ఎస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.రాష్ట్రంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి కీలక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే నిర్మించబడ్డాయని గుర్తుచేశారు.

ఈ ప్రాజెక్టుల నాణ్యతపై ఏనాడూ ప్రశ్నలు రాలేదని, నిర్మాణ లోపాల ఆరోపణలు కూడా లేవని చెప్పారు. కానీ బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు ప్రజల ముందే ప్రశ్నార్థకంగా మారిందన్నారు.ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మధ్యలో నిలిపివేసి, కమిషన్ల కోసం భారీ ఎత్తిపోతలతో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే సహజ గ్రావిటీ ద్వారానే నీటి సరఫరా జరిగేదని పేర్కొన్నారు. కానీ ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకే బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు.

Spread the love

Related News

Latest News