ప్రతిపక్షం, ఆగస్టు 02: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ కీలక అడుగులు వేస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) సహా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు వారంలోగా అర్హులైన పార్టీ కార్యకర్తల పేర్లతో కూడిన నివేదికలను పంపించాలని సూచించారు.
పార్టీ కోసం దీర్ఘకాలంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల్లో 60 శాతం వరకు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు అవకాశం కల్పించేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పోస్టుల కేటాయింపులో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఎలాంటి సిఫార్సులు లేదా ఒత్తిళ్లకు తావు లేకుండా అర్హత, పార్టీ సేవలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో నాయకులు, ఇన్‌ఛార్జి మంత్రులు సమగ్రంగా పరిశీలించి పేర్లను సిఫారసు చేయాలని సూచించారు.
ఈ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే నివేదికలను పరిశీలించిన అనంతరం తుది జాబితాను సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లు వెల్లడించారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న పార్టీ కార్యకర్తల్లో ఈ ప్రకటనతో ఆసక్తి నెలకొంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి ఈ ప్రక్రియలో ప్రాధాన్యం లభించే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
త్వరలోనే జిల్లాల వారీగా పేర్ల పరిశీలన పూర్తిచేసి, ప్రభుత్వం దశలవారీగా నామినేటెడ్ పోస్టుల నియామకాలను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

















